చిగురించే ఆశ..

నింగిలోని నీలి మబ్బుల పల్లకిలో,
నీవు పయనిస్తుంటే...

అవని అంచు నుండి
నిన్ను చేరాలని ప్రయత్నించి,

రెక్కలు తెగిన పక్షినై
కడలి అలల్లో కలసిపోయాను..

మరలా ఆశలు చిగుర్చి
శక్తిని కూడగట్టుకొని,

ఉవ్వెత్తున లేచి
ఒకే ఒక్క నీటి బిందువునై

నిన్ను స్పృశించే
ప్రయత్నం చేస్తాను..

ఒంటరితనం...

బ్రతుకంతా ఎడారై,
ఎంత నిరాదరణ ఎండ కాచినా,
నే సిధ్ధంగా నిలిచాను..

కానీ ఉన్నట్టుండి,

ఒక్క మబ్బు తునక..
సూర్యరశ్మికి అడ్డువచ్చి,
చిరుజల్లులు వర్షిస్తే..

మరలా ఆశలు జనించి,
ఆ మబ్బుతునక సమక్షంలో..
సేదతీరుతున్నపుడు,
అది తుఫాన్ సృష్టిస్తే..

ఇసుకమయ ఎడారిలో
ఏమీ కానరాని తుఫానులో
ఒంటరినైనపుడు..

అన్నింటినీ మరపించే
నీ "చిరునవ్వు" గుర్తుకొచ్చింది..

స్పర్శ..

















ఉవ్వెత్తున లేచే తరంగం
నీలి సంద్రంపై తెల్లని నురుగని
చిరునవ్వులా పరుస్తోంది...

మేనిలో వీణలు మీటినట్లు
నీటివలయాలపై పయనిస్తున్న
చల్లని చిరుగాలి స్పర్శ...

నిన్ను తాకి నన్ను చేరినట్లన్పించి
హృదయం పులకించి
నాట్యమాడే నెమలయ్యింది...

బ్లాగు మిత్రుడు..

అంతర్జాలమందించిన
అభ్యుదయ సహోదరుడు..

రంగుల హరివిల్లునై
ఎన్నడు తోడుంటానంటూ..

అనురాగం, ఆప్యాయత
ఆహ్లాదం, ఆనందం
అహం, ఆత్మ పరిశీలన
ఆవేశం, ఆక్రోషం
వేదన, నివేదన

మదిలో కదిలో
అన్ని భావాలకు వేదికగా..

ఊహలూ, అపోహలూ
నిజాలూ, నిష్టూరాలూ
విమర్శలూ, ఆత్మవిమర్శలూ
చర్చలూ, ఇష్టాగోష్టులూ

అన్నింటిని కలగలిపి..

బ్లాగు దర్శకులందరినీ,
దరిచేర్చిన అజ్ణాతుడు..

మనందరి సహచరుడు,
ఈ బ్లాగు మిత్రుడు...

(బ్లాగు సదుపాయం
ఏర్పాటు చేసిన వారికి
ధన్యవాదములతో..)

నా జీవం..




తీరం చేరాలని పడిలేస్తున్న
కడలి తరంగాన్ని చూస్తే..

నా మనసు పడే ఆరాటం 
నీకు తెలుస్తుంది..

అరుణోదయం కోసం
కమలం ఆవేదన చూస్తే..

నా ఊపిరి నీవేనని
నీకు అన్పిస్తుంది..

వెన్నెల కోసం కలువభామ
వేదన వీక్షిస్తే..

నీ చిరునవ్వుకు తపించే
నేను నీకు కన్పిస్తాను..

ఆమని రాక కోసం
ఆత్రపడే వనాన్ని గమనించు..

నా మదిలో నిండినది
నీ రూపమేనని తెలుస్తుంది..

తొలకరి జల్లు కోసం
పుడమి ఆరాటం చూస్తే..

నా జీవం నీవేనని
నీకు అర్దమవుతుంది..

క్షణమే యుగమై..

                     
                                                         సంధ్యా సమయాన
                                                         భూదేవి నొసటన
                                                         కుంకుమ పెట్టినట్లు...
                                                     
                                                         కొండల వెనుక నుండి
                                                         సూర్యుని వీద్కోలు,

                                                         అరుణోదయం కోసం
                                                         వేచి చూస్తున్న గగనానికి,

                                                         వెన్నెల వెలుగులు
                                                         ఊరటనిస్తున్నాయి..
                                                      
                                                         క్షణమే యుగమై...
                                                         నీ రాక కోసం పరితపించే
                                                         నా హృదయాన్ని..
                               
                                                         సేద తీర్చేదేదీ లేదు
                                                         ప్రియతమా...




                                                         



                                     

వసంతం..


                                  హేమంత ఋతురాత్రి కురిసిన...
                                  మంచు బిందువుల స్పర్శకు,
                                                       
                                  సుకుమారత్వాన్ని ఆపాదించుకున్న,
                                  గడ్డిపరక లాలిత్యాన్ని నీ ముఖంలో చూస్తూ ..

                                  మనసున నిండిన శిశిర నిశీధుల్ని మరచి..
                                  వసంతం నింపుకున్న వనంలా,

                                  నా హృ దయం....
                                  సుగంధ పరిమళాల్ని సొంతం చేసుకుంది.

                                                                    

నిష్క్రమణ...



నల్లని మబ్బుల వెనుక సూర్యున్ని దాచి,
నింగి తన కురులతో రాత్రి  పరచిన వేళ నుండి...

నిదుర  రాని అర్ధరాత్రి వరకు విఫల యత్నం చేసి..
అలసి... జామురాత్రిలో ..నాకనులు మూతపడ్డపుడు,

ఏదో తెలియని వేదన,
నా గుండెల్ని పిండేస్తున్నట్లు..

మమతానురాగాలు మిళితం ఛేసి ఆరాధనతో ..
నే నిర్మించుకున్న నా కలల సౌధం నుండి..

పరదాల మాటున ఓ రూపం 
చిరుమువ్వల సవ్వడితో కదిలి వెల్తున్నట్లు,

నా స్మృతి పదం చేరేసరికి..
చాలా దూరం అవుతున్నట్లు..

ఆ ఊహనే నే భరించలేకున్నాను..
అదే నిజమైతే.. నా ఊపిరి ఆగి..

ఆ సవ్వడి వెంట..
నా  ప్రాణం కూడా పోతుంది..



నిరీక్షణ..

వేకువ వెన్నెల కావొద్దంటే,

అరుణ కిరణమై..
నను మేల్కొలుపుతానంటావ్,

సాయం సంధ్య కావొద్దంటే,


చిరుగాలితో కలిసి..
నను స్పృశిస్తానంటావ్..

ఎండమావి కావొంద్దంటే,


మేఘాలను చేరి..
చిరుజల్లునై తిరిగొస్తానంటావ్..

నే నిరీక్షంచలేను..
ఆ మధ్య క్షణాల్ని కూడా...

నీ ఊహా లోకంలో...




















 
మేఘాల దొంతరలు

కడలి అలలపయనం

చిరుగాలి  ఆహ్లాదం

శీతల పవనం స్పర్శ

ఇంద్ర ధనుస్సు వన్నెలు

కురిసే పొగ మంచు

జాలువారే వెన్నెల

అరుణోదయం ఆగమనం

సంధ్య వీడ్కోలు

"ప్రకృతిలో ప్రతి అణువు"

నీ ఊహా లోకంలో

నాకు నిత్య నూతనమే ప్రియా..